సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయం
యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా లక్ష్మణ్
మెదక్:జిల్లా: చిన్నశంకరంపేట, అక్టోబర్ 31 (మంజీర మెరుపు)
తెలంగాణ ప్రాంత మెదక్ జిల్లా ఉపాధ్యాయ సంఘం (తపస్) చిన్నశంకరంపేట శాఖ ఆధ్వర్యంలో మండలంలోని మందాపూర్ ఎంపీయూపీఎస్ పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ.. 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నడియాడ్‌లో జన్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో విశేష కృషి చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన చూపిన చొరవ చరిత్రలో నిలిచిపోయిందన్నారు.రాజ్యాంగ రచన సమయంలో ప్రాథమిక హక్కుల కమిటీకి అధ్యక్షత వహించారని గుర్తుచేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1991లో మరణానంతరం భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందన్నారు.2014 నుంచి ఆయన జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నేటి యువత పటేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశ ఐక్యత, సమగ్రత కోసం కృషి చేయాలని సూచించారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అశోక్, శోభారాణి, శ్రీనివాస్, గీత, తపస్ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, రమాదేవి, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.
