మత్తు పదార్థాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
మత్తు పదార్థాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి
-- జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
మెదక్: బ్యూరో. అక్టోబర్.30. మంజీర మెరుపు:
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు, మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని సూచించారు.శుక్రవారం మెదక్ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన రోడ్డు భద్రతా కమిటీ, మత్తు పదార్థాల నియంత్రణ సమావేశంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, మత్తు పదార్థాల కట్టడిపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కల్పించాలని, జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నివేదికలు సమర్పించాలని అధికారులకు స్పష్టం చేశారు.
రహదారులపై భారీ వాహనాల పార్కింగ్‌ను నియంత్రించాలి
అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. భారీ వాహనాలను రహదారులపై నిలిపివేయడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందన్నారు. వాహనాల పార్కింగ్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని, రహదారులపై రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని సూచించారు.రోడ్డు భద్రతా నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని, సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు, సంబంధిత ఏసీపీలు, ట్రాఫిక్ అధికారులు, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు, రోడ్డు భద్రతా కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
